తమ పోలీసులు కాల్చిచంపిన భారతీయుడి మృతదేహాన్ని భారత్ కు అప్పగించిన నేపాల్!

07-03-2021 Sun 10:23
  • గత గురువారం నాడు సరిహద్దుల్లో కాల్పులు
  • చర్చల అనంతరం మృతదేహాన్ని అప్పగించిన నేపాల్
  • అంత్యక్రియలు ముగిశాయన్న జిల్లా ఎస్పీ
Nepal Handover Indian Body who killed Last Week by Army

తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ, నేపాల్ పోలీసులు కాల్చి చంపిన భారతీయుడి మృతదేహాన్ని ఆ దేశ అధికారులు ఇండియాకు అప్పగించారు. సరిహద్దు గ్రామంలో నివసించే 24 ఏళ్ల గోవింద సింగ్ అనే యువకుడిని గత గురువారం నాడు నేపాల్ పోలీసులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆపై ఇరు దేశాల అధికారుల మధ్యా మృతదేహం అప్పగింతకై పలుమార్లు జరిగిన చర్చలు ఫలించాయి. నేపాల్ అధికారుల పోస్టుమార్టం తరువాత గోవిందా సింగ్ మృతదేహం ఇండియాకు చేరిందని, శనివారం నాడు అతని బంధువులు అంత్యక్రియలు జరిపించారు. పిలిభిత్ ఎస్పీ జై ప్రకాశ్ యాదవ్ వెల్లడించారు.

కాగా, గోవిందా సింగ్, తమ దేశంలోకి స్మగ్లింగ్ నిమిత్తం వస్తుంటే గుర్తించామని నేపాల్ పోలీసులు అంటుండగా, ఘటనను దగ్గరి నుంచి చూసిన స్థానికులు మాత్రం, నేపాల్ సైనికులతో వాగ్వాదానికి దిగడమే కాల్పులకు కారణమైందని అంటున్నారు. ఇదే ఘటనలో గాయపడిన గుర్మేజ్ సింగ్ అనే మరో యువకుడిని మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీకి తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉండి తప్పించుకున్న రేషమ్, పప్పూ సింగ్ లను పిలిబిత్ పోలీసులు విచారించి, నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.