Mamata Banerjee: కోల్ కతాకు నరేంద్ర మోదీ, కేరళ, తమిళనాడుకు అమిత్ షా!

  • ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఊపందుకున్న ప్రచారం
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ సభ
  • పోటీగా పెట్రోలు ధరలకు వ్యతిరేకంగా మమత నిరసన ప్రదర్శన
  • తమిళనాడులో భారీ ర్యాలీలో పాల్గొననున్న అమిత్ షా
Modi in West Bengal and Amit shah in Kerala and Tamilnadu

నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తరువాత అన్ని పార్టీల అధినేతలూ ప్రచారంలో మునిగిపోయారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య విమర్శల వాడి పెరిగింది. అన్ని పార్టీల నేతలు కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ ప్రచార పర్వంలోకి దిగుతున్నారు.

నేడు కోల్ కతాలో జరిగే ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగసభను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు భారీఎత్తున ఏర్పాట్లు చేశాయి. ఇక ఇదే సమయంలో పెరుగుతున్న పెట్రోలు ధరలకు నిరసనగా సిలిగురిలో జరిగే నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా పాల్గొననున్నారు.

కాగా, మరో బీజేపీ నేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, నేడు దక్షిణాదిన ఎన్నికలు జరిగే కేరళ, తమిళనాడులో పర్యటించి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. తమిళనాడులోని సుచీంద్రమ్ పట్టణంలో పర్యటించే అమిత్ షా, ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన ఉదయం సుచీంద్రం దేవస్థానం నుంచి ప్రారంభం కానుండగా, ఆపై 11 గంటల తరువాత హిందూ కాలేజీ నుంచి కన్యాకుమారిలోని కామరాజ్ విగ్రహం వరకూ భారీ రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం తరువాత బీజేపీ కార్యకర్తలతో ఉడిపి హోటల్ లో సమావేశం అవుతారు.

ఆపై అమిత్ షా తిరువనంతపురం బయలుదేరి వెళతారని, అక్కడి బేలూరు మఠాన్ని సందర్శించి, పూజలు జరిగిన అనంతరం, సాయంత్రం జరిగే బీజేపీ కేరళ విజయ్ యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారని, బీజేపీ కోర్ కమిటీ సమావేశంలోనూ పాల్గొంటారని, రాత్రి 10.30 గంటల తరువాత తిరువనంతపురం నుంచి బయలుదేరి వెళతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.

More Telugu News