ప్రియుడిని పెళ్లాడేందుకు యువతి డ్రామా... బెడిసి కొట్టడంతో జైలుపాలు!

07-03-2021 Sun 09:40
  • పంజాబ్ లోని జలంధర్ లో ఘటన
  • పెళ్లి కోసం బంధువుల కుమార్తె కిడ్నాప్
  • అరెస్ట్ చేసిన పోలీసులు
Lady Kidnap Drama for Marriage fail

తన ప్రియుడిని పెళ్లాడాలన్న ఆలోచనతో ఓ యువతి తన బంధువులకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై, కటకటాల పాలైంది. పంజాబ్ పరిధిలోని జలంధర్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, నిషు ద్వివేదీ అనే 20 ఏళ్ల యువతి, ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. అతన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న ఆమె, అందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.

తమ బంధువులకు చెందిన ఓ మూడేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసింది. ప్రియుడితో పెళ్లి కావడానికి కొంత సమయం పడుతుందన్న ఆలోచనలో ఉన్న ఆమె, హోటల్లో అతనితో కలసి ఉండాలంటే, ఎవరికీ అనుమానం రాకుండా చూసుకోవాలని, అందుకు తన పక్కనే పాప ఉంటే బాగుంటుందని భావించింది. అయితే, పాప కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, పాప గురించి వెతుకులాట ప్రారంభించారు. వీరిద్దరినీ జలంధర్ లోని ఓ హోటల్ లో గుర్తించి, పాపను రక్షించారు. తాను పాపను కేవలం రక్షణ కోసమే తెచ్చుకున్నానని, హాని తలపెట్టే ఉద్దేశం తనకు లేదని నిషు ద్వివేది పోలీసుల విచారణలో వెల్లడించిందట. ఇక వారిద్దరిపై కిడ్నాస్ సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు, విచారణ జరుపుతున్నారు.