USA: అతిపెద్ద ఉద్దీపన... 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి యూఎస్ సెనేట్ ఆమోదం!

  • 50-49 తేడాతో ఆమోదం
  • ఒక్కో అమెరికన్ ఖాతాలో 1,400 డాలర్లు
  • ఆర్థిక వ్యవస్థను గాడిన పడవేస్తామన్న బైడెన్
Senete Passes Highest Stimulus Package of US

అమెరికా చరిత్రలో అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీకి శనివారం నాడు సమావేశమైన అమెరికా సెనేట్ ఆమోదం పలికింది. రిపబ్లికన్ సభ్యులంతా దీన్ని వ్యతిరేకించగా, ఈ బిల్లు 50-49 ఓట్లతో ఆమోదం పొందినట్టు అమెరికా పేర్కొంది. అమెరికాపై కరోనా పంజాను విసిరి, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన తరువాత, కోట్లాది మంది నిరుద్యోగులుగా మారిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడగా, వారందరినీ ఆదుకునేందుకు తాను ప్రయత్నిస్తానని, అధికారంలోకి రాగానే భారీ ప్యాకేజీని ప్రకటిస్తానని జో బైడెన్ హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసిన ఆయన, యూఎస్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ నిధులతో చిన్న, మధ్య తరహా సంస్థలకు నిధుల కొరత లేకుండా చూస్తామని, అన్ని రాష్ట్రాలూ మాంద్యం నుంచి బయటపడేలా చేస్తామని ఆయన అన్నారు. ఇక రానున్న శుక్రవారం నాడు కాంగ్రెస్ ముందుకు ఈ బిల్లు రానుంది.

యూఎస్ కాంగ్రెస్ లో బిల్లుకు ఆమోదముద్ర పడిన తరువాత, జో బైడెన్ సంతకంతో ఇది చట్టరూపం దాల్చనుంది. ఈ ప్యాకేజీ అమలులోకి వస్తే, అమెరికన్ సిటిజన్లకు భారీ ఉపశమనం లభిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సాయంతో పాటు పన్ను మినహాయింపులు, కరోనాను తరిమేసేందుకు అవసరమైన నిధుల కోసం ఈ ప్యాకేజీని వాడనున్నారు.

ఇక మొత్తం ప్యాకేజీలో 400 బిలియన్ డాలర్లు అమెరికన్ పౌరులకు ఆర్థిక సాయంగా లభిస్తుంది. అంటే, ఒక్కొక్కరి ఖాతాలో 1,400 డాలర్లు జమ అవుతాయి. రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల కోసం మరో 350 బిలియన్ డాలర్లు కేటాయిస్తారు. కరోనా కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు బిల్లులోని నిధులను వాడుకుంటామని, సెనేట్ లో బిల్లు ఆమోదం పొందడం హర్షించదగిన అంశమని ఈ సందర్భంగా జో బైడెన్ వ్యాఖ్యానించారు.

More Telugu News