భారత నౌకాదళం మరింత బలోపేతం... జాతికి అంకితం కానున్న ఐఎన్ఎస్ కరంజ్!

07-03-2021 Sun 07:46
  • మేకిన్ ఇండియా స్ఫూర్తితో తయారు
  • కల్వరి శ్రేణిలో మూడవ సబ్ మెరైన్
  • అణ్వాయుధాలు ప్రయోగించే సామర్థ్యం
  • 10న జాతికి అంకితం
INS Karanj To be Commissioned on March 10th

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జలాంతర్గామి ఐఎన్ఎస్ (ఇండియన్ నావెల్ షిప్) కరాంజ్, ఈ నెల 10న జాతికి అంకితం కాబోతోంది. కల్వరి క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్ మెరైన్ల శ్రేణిలో ఇది మూడవది కావడం గమనార్హం. "ఇండియాలో తయారైన ఈ జలాంతర్గామి నౌకాదళానికి సేవలు అందించేందుకు సిద్ధం కావడం మాకెంతో గర్వకారణం. మేకిన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని తయారు చేయడం జరిగింది. భవిష్యత్తులో దీని సేవలు ఎంతో ఉపకరించనున్నాయి" అని కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ గౌరవ్ మెహతా వ్యాఖ్యానించారు.

శనివారం నాడు ఐఎన్ఎస్ కరాంజ్ జలాంతర్గామిని పరిశీలించేందుకు మీడియాకు అనుమతి ఇచ్చారు. ఈ జలాంతర్గామిలో 39 మంది పని చేస్తుంటారని, ఇది షిఫ్ట్ ల వారీగా పని చేస్తుందని కరాంజ్ చీఫ్ మోతానీ సుహైల్ వెల్లడించారు. సబ్ మెరైన్ లోకి వెళ్లి నెలల తరబడి విధులు నిర్వహించేందుకు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, ఇది చాలా సవాళ్లతో కూడుకున్నదని ఆయన అన్నారు.

"ఒకసారి సబ్ మెరైన్ లోకి వెళితే నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వుంటుంది. రోజుల తరబడి సూర్యుడిని చూసేందుకు వీలుండదు. నాలుగు రోజులకు ఒకసారే స్నానం చేయాల్సి వుంటుంది. షిప్ లో కర్బన స్థాయి పెరుగుతూ ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉండాలి. మన టాయిలెట్లను మనమే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నియమిత ఆహారం మాత్రమే తీసుకోవాల్సి వుంటుంది" అని ఆయన అన్నారు.

కాగా, కల్వరి శ్రేణిలో ఇప్పటివరకూ ఐఎన్ఎస్ కల్వరి 2017లో, ఐఎన్ఎస్ ఖాందేరి 2019లో జాతికి అంకితం అయ్యాయి. మరో మూడు జలాంతర్గాములు తయారీ దశలో ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే, మరో రెండేళ్లలో ఆరు సబ్ మెరైన్లూ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మోహరించబడతాయి. ఇక వీటి నుంచి అణ్వాయుధాలను కూడా ప్రయోగించవచ్చు. ఫ్రాన్స్ కు చెందిన కంపెనీ సహకారంతో గోవాలోని షిప్ యార్డ్ లో వీటిని తయారు చేస్తున్నారు.