విడుదలైన వరవరరావు... తెలంగాణకు వచ్చే చాన్స్ నిల్!

07-03-2021 Sun 07:35
  • గత వారం బెయిల్ మంజూరు
  • నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి బయటకు
  • నిబంధనల మేరకు ముంబైలోనే ఉండాల్సిందే
Varavara Rao Released on Bail

ప్రముఖ విప్లవ కవి వరవరరావుకు రెండున్నరేళ్ల జైలు జీవితం నుంచి స్వేచ్ఛ లభించింది. గత  వారం ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుని నిన్న రాత్రి 11.45 గంటలకు ముంబైలోని నానావతి ఆసుపత్రి నుంచి వరవరరావు బయటకు వచ్చారని, ఆయన తరఫున కోర్టులో వాదిస్తున్న న్యాయవాది ఇందిరా జైసింగ్ తన‌ ట్విట్టర్ ఖాతా లో తెలియజేశారు.

బెయిల్ మంజూరు అయినా, కోర్టు పెట్టిన షరతుల మేరకు ఆయన ముంబై నగరాన్ని దాటి బయటకు వెళ్లేందుకు వీల్లేదు. భీమా కోరేగాం కేసులో నిందితుడిగా ఆరోపించబడిన వరవరరావు రెండున్నరేళ్లుగా ముంబైలోని తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన్ను కోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆసుపత్రిలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఇప్పుడాయన కోలుకుని బయటకు వచ్చారు.