తమిళనాడులో కాంగ్రెస్ కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే!

07-03-2021 Sun 06:38
  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • 30 సీట్లు కోరిన కాంగ్రెస్
  • చర్చల అనంతరం 25 సీట్లకు అంగీకారం
Deal Settle in Tamilnadu Between Congress and DMK for Seat Sharing

త్వరలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ కు 25 సీట్లను కేటాయించినట్టు డీఎంకే వర్గాలు వెల్లడించాయి. ఓ రాజ్యసభ సీటును కూడా ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించిందని పార్టీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు 30 సీట్లు కావాలని పట్టుబట్టిందని, తొలుత 24 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించిన డీఎంకే అధిష్ఠానం, ఆపై చర్చల తరువాత మరో సీటును పెంచిందని వెల్లడించారు. శనివారం సాయంత్రం ఈ మేరకు ఒప్పందం కుదిరిందని, 25 స్థానాలు తీసుకుని కలసికట్టుగా ముందడుగు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించిందని ఆ పార్టీ నేత దినేశ్ గుండూరావు వెల్లడించారు. ఈ ఉదయం ఈ మేరకు ఒప్పందంపై ఇరు పార్టీలూ సంతకాలు చేస్తాయని తెలిపారు.

ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ కేఎస్ అళగిరి, ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే హవా నడుస్తోందని, దీంతో బేరసారాల విషయంలో తాము పట్టుబట్టే అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు. ఇరు పార్టీలూ సీట్ల షేరింగ్ విషయంలో పలుమార్లు చర్చలు జరిపాయని ఆయన అన్నారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 41 స్థానాలను డీఎంకే కేటాయించింది. ఏప్రిల్ 6న ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడతాయి.