టీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దు: కిషన్ రెడ్డి

06-03-2021 Sat 22:11
  • హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో సమావేశం
  • ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా సమావేశం
  • ఉద్యమ ద్రోహులు ప్రగతిభవన్ లో ఉన్నారన్న కిషన్ రెడ్డి
  • కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయని వ్యాఖ్యలు
Kishan Reddy says do not trust TRS statements

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్ లో జరిగిన సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. ఉద్యమకారులు రోడ్లపై ఉంటే, ఉద్యమద్రోహులు ప్రగతి భవన్ లో ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మరాదని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు చేసిందేమీ లేదని అన్నారు. బంగారు తెలంగాణ అన్నారని, కానీ తెలంగాణలో కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయని ఆరోపించారు.

ప్రపంచంలో సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ప్రధాని మోదీ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తెలంగాణకు కీలకమని అన్నారు.