అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతోంది: హరీశ్ రావు ఆరోపణ

06-03-2021 Sat 21:52
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా హరీశ్ రావు
  • టూరిజం ప్లాజా హోటల్ లో కార్యక్రమం
  • రాజ్యాంగ హక్కులు కాలరాసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ 
  • అదే జరిగితే వందేళ్లు వెనక్కిపోతామని వివరణ
Harish Rao attends graduates get together meet

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో జరిగిన పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతోందని, రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించి వేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అదే జరిగితే 100 ఏళ్లు వెనక్కిపోతామని తెలిపారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఇవాళ అందరం ఇక్కడున్నామని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని కాలరాస్తూ, రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మాయమాటలు చెబుతూ, బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, బీజేపీ రెచ్చగొట్టే ప్రకటనలకు ఎవరూ మోసపోరాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై అందరూ ఆలోచించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఓట్లు వస్తూనే ఉంటాయని, ఎందుకు ఓటు వేస్తున్నామో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హరీశ్ రావు సూచించారు.