రామమందిరం విరాళాల్లో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది: చంపత్ రాయ్

06-03-2021 Sat 21:10
  • అయోధ్యలో రామమందిరం నిర్మాణం
  • జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ
  • ఫిబ్రవరి 4 నాటికి రూ.2,500 కోట్ల విరాళాలు
  • విరాళాల సేకరణ నిలిపివేస్తున్నట్టు ట్రస్టు ప్రకటన
  • ఇకపై ఆన్ లైన్ లోనే విరాళాల అందజేత
Telangana in second place in Ram Mandir donations

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివరాలు తెలిపారు. దేశవ్యాప్తంగా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాలు సేకరించినట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 4 నాటికి రూ.2,500 కోట్ల మేర విరాళాలు వచ్చాయని అన్నారు. విరాళాల్లో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని తెలిపారు.

దేశంలోని 4 లక్షల గ్రామాల్లో విరాళాల సేకరణ నిర్వహించామని, 9 లక్షల మంది కార్యకర్తలు విరాళాల సేకరణలో పాల్గొన్నారని వివరించారు. ఇంటింటికీ విరాళాల సేకరణను నిలిపివేశామని చంపత్ రాయ్ వెల్లడించారు. ఇకపై వెబ్ సైట్ ద్వారా మాత్రమే విరాళాల సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.  మరో మూడేళ్లలో రామమందిరం నిర్మాణం జరుపుకుంటుందని పేర్కొన్నారు.