హిట్లర్ వంటివాళ్లే మట్టికరుచుకుపోయారు... మీరెంత?: పవన్ కల్యాణ్

06-03-2021 Sat 20:39
  • ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
  • పవన్ కల్యాణ్ వీడియో సందేశం
  • సిద్ధాంతాలే అండగా రాజకీయాలు చేస్తున్నామని వెల్లడి
  • వైసీపీ దౌర్జన్యాలు చేస్తోందని వ్యాఖ్యలు
  • జనసేన ఎదురొడ్డి నిలుస్తోందన్న పవన్
Pawan Kalyan fires on YCP leaders

ఏపీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా వీడియో సందేశం అందించారు. ధనబలం, కండబలం ఉంటేనే రాజకీయాలు చేయగలరన్న పరిస్థితిని మార్చేందుకే 2014లో జనసేన పార్టీని స్థాపించానని, సిద్ధాంతాలే అండగా, కులమత ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలని వచ్చానని వివరించారు.

తాము ఆశించిన మార్పు క్రమంగా వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని, పంచాయతీ ఎన్నికల్లో 27 శాతం ఓట్లను పొందడమే కాకుండా, వందల సంఖ్యలో సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నామని తెలిపారు. ఈ మార్పును చూసి భయపడుతోన్న వైసీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎంతటి దాష్టీకానికి పాల్పడ్డారో మున్సిపల్ ఎన్నికల్లో అంతకు పది రెట్లు ఎక్కువ బీభత్సం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వీరి దాడులకు పెద్ద పెద్ద పార్టీలు సైతం నిలవలేకపోయిన నేపథ్యంలో, జనసైనికులు ఎదురొడ్డి నిలిచారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ నేతలు బెదరింపులకు పాల్పడినా జనసేన అభ్యర్థులు వెనుకంజ వేయలేదని, వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచి యుద్ధం చేయగల రక్తం జనసైనికులదని కొనియాడారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వాళ్లకు ప్రత్యర్థులుగా బరిలో దిగితే బెదిరింపులు, కిడ్నాప్ లు చేస్తున్నారని... వైసీపీ వాళ్లను ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతారని పవన్ అభిప్రాయపడ్డారు. ఎదిరించి నిలిచే వ్యక్తులు లేకపోతే వైసీపీ నేతల దాష్టీకానికి అంతు ఉండదని అన్నారు.

"ఈ ప్రపంచం హిట్లర్ వంటివాళ్లను కూడా చూసింది, కానీ వారు కాలక్రమంలో మట్టికరుచుకుపోయారు. మీరెంత? మీ బతుకెంత?" అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మీ దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలే మిమ్మల్ని త్వరలో తరిమికొట్టే రోజులు వస్తాయి అని స్పష్టం చేశారు. త్వరలోనే జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏపీలో ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. మార్పు రావాలన్న సంకల్పంతోనే బీజేపీతో కలిశామని వివరణ ఇచ్చారు.