విశ్వాస పరీక్షలో గట్టెక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

06-03-2021 Sat 17:59
  • ఇటీవల సెనేట్ లో అధికార పక్షానికి ఓటమి
  • పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కొన్న ఇమ్రాన్ ఖాన్
  • 178 ఓట్లతో విశ్వాస పరీక్ష నెగ్గిన ఇమ్రాన్
  • తనకు ఓటేసిన వారికి ఇమ్రాన్ కృతజ్ఞతలు
Pakistan PM Imran Khan wins vote of trust in national parliament lower house

కొన్నిరోజుల కిందట సెనేట్ లో పాకిస్థాన్ అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) ఓటమిపాలైంది. దాంతో ఇవాళ పాక్ పార్లమెంటు దిగువ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 178 ఓట్లు లభించాయి. బలపరీక్ష నెగ్గేందుకు 172 ఓట్లు అవసరం కాగా, ఇమ్రాన్ కు 6 ఓట్లు అధికంగానే లభించాయి.

పీటీఐ పార్టీకి చెందిన 155 మంది ఎంపీలు తమ అధినేత ఇమ్రాన్ కే ఓటేశారు. అంతేకాకుండా, బలూచిస్తాన్ అవామీ పార్టీ, ఎంక్యూఎం (పీ), గ్రాండ్ డెమొక్రటిక్ అలయెన్స్, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్వయిద్)కు చెందిన ఎంపీలు కూడా విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ కు మద్దతుగా నిలిచారు. ఓ స్వతంత్ర ఎంపీ కూడా ప్రధానికి బాసటగా నిలిచారు. తనకు ఓట్ చేసిన వారందరికీ ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు.

బుధవారం జరిగిన సెనేట్ ఎన్నికల్లో ఇమ్రాన్ కేబినెట్ కు చెందిన ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమిపాలయ్యారు. సెనేట్ ఎన్నికల్లో హఫీజ్ షేక్ పై మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ విజయం సాధించారు. దాంతో విపక్షాలు ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ తప్పుకోవాలంటూ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో బలపరీక్ష నిర్వహించగా, 11 పార్టీల విపక్ష కూటమి ఓటింగ్ ను బహిష్కరించింది.