ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ షురూ!

06-03-2021 Sat 15:50
  • వచ్చే నెలలో ఐపీఎల్-2021
  • మే 30న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
  • వేదికల అంశంలో ఎటూ తేల్చని పాలకమండలి
  • తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం
IPL likely to be started in next month

ఐపీఎల్-2021 పోటీలు ఏప్రిల్ 9న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఐపీఎల్ పాలకమండలి నిర్ణయించింది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు లీగ్ పోటీలు నిర్వహించేందుకు నేడు జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో తీర్మానించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అయితే, చర్చనీయాంశంగా మారిన ఐపీఎల్ వేదికల సంఖ్యను ఈ సమావేశంలో ఎటూ తేల్చలేకపోయారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలోనే వేదికలను ఎంపిక చేయడంతో, పలు నగరాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశంలో వేదికలపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు.

వాస్తవానికి కరోనా మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ లో ఏదో ఒక నగరంలోనే ఐపీఎల్ పోటీలన్నింటిని నిర్వహించాలని భావించారు. అనంతరం, నాలుగైదు నగరాల్లో జరపాలన్న ప్రతిపాదనలు రావడం, ఆ మేరకు కొన్ని నగరాల పేర్లను బీసీసీఐ వర్గాలు పేర్కొనడం జరిగింది. పలు ఫ్రాంచైజీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నగరాలు ఆ జాబితాలో లేకపోవడం విమర్శలపాలైంది. దాంతో ఈ నిర్ణయాన్ని బోర్డు వర్గాలు పునఃసమీక్షించనున్నాయి.