బీజేపీ శ్రేణులే టార్గెట్ గా బాంబు పేలుడు.. ఆరుగురు కార్యకర్తలకు గాయాలు!

06-03-2021 Sat 15:29
  • పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకున్న ఘటన
  • పెళ్లికి వెళ్లి తిరిగివస్తున్న బీజేపీ శ్రేణులపై బాంబులతో దాడి
  • సబ్ డివిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
Six BJP workers injured in bomb attack

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. మరోవైపు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో బీజేపీ శ్రేణులే టార్గెట్ గా బాంబు పేలుడు సంభవించింది. బీజేపీకి చెందిన వ్యక్తులు ఓ పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా వారిపై ప్రత్యర్థులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని సమీపంలో ఉన్న సబ్ డివిజన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును  ప్రారంభించారు.

ఈ ఎన్నికలను బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలిచి పైచేయి సాధించాలని ఇరు పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. పార్టీలకే కాకుండా, నేతలకు కూడా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలోనే, రాష్ట్రంలో పలుచోట్ల దాడులు చోటుచేసుకుంటున్నాయి.