కొడుకు సాయంతో.. 27 ఏళ్ల క్రితం తనపై అత్యాచారం చేసిన వారిపై ఇప్పుడు కేసు పెట్టిన మహిళ!

06-03-2021 Sat 14:35
  • అక్కాబావలతో కలిసి ఉండగా రేప్ చేసిన ఇద్దరు
  • 1994లో బాబుకు జన్మనిచ్చిన బాధితురాలు
  • తన సొంతూరు వ్యక్తికి బాబు అప్పగింత
  • వేరొకరికిచ్చి పెళ్లి చేసిన బావ
  • పదేళ్లకు విషయం తెలిసి విడాకులిచ్చిన భర్త
  • పెద్దయి అమ్మానాన్నల వివరాలడిగిన అబ్బాయి
Raped 27 Years Ago Woman Files Case Against 2 After Son Asks Fathers Name

నాన్న ఏడమ్మా? అని కొడుకు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆ తల్లికి తెలియలేదు. 27 ఏళ్ల క్రితం 12 ఏళ్ల వయసులో తనపై ఇద్దరు అత్యాచారం చేశారని చెప్పలేకపోయింది. ధైర్యం కూడదీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కింది.

కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులపై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..

షాజహాన్ పూర్ లో 27 ఏళ్ల కిందట తన అక్క, బావతో కలిసి బాధితురాలు నివసించేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారుండే ప్రాంతంలోనే నివసించే నాకీ హసన్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి తమ్ముడు గుడ్డూ కూడా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అమ్మాయిపై చాలా సార్లు ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు.

1994లో 13 ఏళ్లున్నప్పుడు ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబును పెంచలేక తన సొంతూరు ఉధంపూర్ కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చింది. ఆ తర్వాత తన బావకు రాంపూర్ కు బదిలీ కావడంలో వారితో పాటే అక్కడకు వెళ్లిపోయింది. కాలక్రమంలో ఘాజీపూర్ కు చెందిన వ్యక్తితో ఆమెకు ఆమె బావ పెళ్లి చేశాడు. అయితే, పదేళ్ల పాటు సంసారం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత నిజం తెలిసి ఆమెను కట్టుకున్న వాడు వదిలేశాడు.

అప్పటికి పెరిగి పెద్దయిన బాబు.. అమ్మానాన్నల గురించి అడిగాడు. పెంచిన వ్యక్తి అమ్మ పేరును చెప్పాడు. దీంతో తన తల్లిని వెతుక్కుంటూ వచ్చిన బాబు.. తన తండ్రి ఎవరని అడిగాడు. దీంతో జరిగిన విషయం చెప్పింది. కొడుకు సాయంతో శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు.