కేశినేని నానిని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని: బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

06-03-2021 Sat 13:29
  • చంద్రబాబును ఏక వచనంతో సంబోధించాడు
  • రంగాను హత్య చేసిన వ్యక్తితో ప్రచారం చేస్తున్నాడు
  • కేశినేని నానితో మేము విసిగిపోయాం
Budda Venkanna sensational comments on Kesineni Nani

విజయవాడ టీడీపీలో నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. పార్టీకి చెందిన నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్న వర్గీయులంతా ఏకమై ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, కేశినేని నానితో గత కొన్ని రోజులుగా విసిగిపోయామని మండిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామని చెప్పారు. తమ అధినేత చంద్రబాబును కేశినేని ఏక వచనంతో సంబోధించడం శోచనీయమని అన్నారు. తాను విజయవాడకే అధిష్ఠానం అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దురంహంకారాన్ని సూచిస్తున్నాయని దుయ్యబట్టారు.

కేశినేని అహంకారాన్ని చూసి ఆరోజు తాను చెప్పుతో కొట్టాలనుకున్నానని బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, చంద్రబాబు మీద ఉన్న గౌరవంతో ఆ పని చేయలేదని చెప్పారు. రంగా హత్య కేసులో ఉన్న ముద్దాయిని కేశినేని ప్రచారంలో తిప్పుతున్నారని విమర్శించారు. కేశినేని నాని స్థాయి దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 'దమ్ముంటే రా.. తేల్చుకుందాం' అంటూ కేశినేనికి సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీకి బీసీలను దూరం చేస్తున్నాడంటూ కేశినేనిపై మండిపడ్డారు. బుద్ధా వ్యాఖ్యలు టీడీపీలో అంతర్గతంగా కలకలం రేపుతున్నారు.