కేశినేని కావాలో లేక మేమంద‌రం కావాలో తేల్చుకోండి: చ‌ంద్ర‌బాబుకు బోండా ఉమ అల్టిమేటం

06-03-2021 Sat 12:43
  • కేశినేని నాని తీరు స‌రికాదు
  • చంద్ర‌బాబుకు ఆయ‌నే ముఖ్య‌మా?
  • అయితే రేప‌టి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో మేము పాల్గొనం
  • టీడీపీ వ‌ల్లే కేశినేని గెలిచారు
  • సొంతంగా గెల‌వ‌లేరు
bonda uma slams kesineni nani

త‌మ పార్టీ ఎంపీ కేశినేని నాని తీరుపై టీడీపీ నేత‌ బోండా ఉమ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ టీడీపీకి తానే అధిష్ఠానమని కేశినేని వ్యాఖ్య‌లు చేసి త‌న తీరును బ‌య‌ట‌పెట్టార‌ని చెప్పారు.  తన కూతురుని మేయర్ చేయడం కోసమే ఆయ‌న  ఇటువంటి తీరును కన‌బ‌ర్చుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కేశినేని కావాలో.. తామంద‌రం కావాలో తేల్చుకోవాలని ఆయ‌న‌ అల్టిమేటం జారీ చేశారు. చంద్ర‌బాబుకు కేశినేని  నాని ముఖ్యం అనుకుంటే, తాము రేపు జరుగబోయే చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉంటామని ఆయ‌న చెప్పారు.

కేశినేని నాని కులాల మధ్య, పార్టీ నేతల మధ్య వివాదాలు సృష్టిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీలో ఉన్నందుకే కేశినేని నాని గెలిచార‌ని, ఆయ‌న‌కు విజ‌య‌వాడ‌లో అంత‌గా స‌త్తా ఉంటే రాజీనామా చేసి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలిచి చూపించాల‌ని బోండా ఉమ స‌వాలు విసిరారు. ఆయ‌న అలా గెలిస్తే తాను విజ‌య‌వాడను వ‌దిలేసి కట్టుబట్టలతో వెళ్లిపోతాన‌ని వ్యాఖ్యానించారు.