తొలి హిందీ సినిమా షూటింగులో రష్మిక.. భావోద్వేగాలతో పోస్ట్!

06-03-2021 Sat 12:28
  • 'మిషన్ మజ్ను'లో నాయికగా రష్మిక 
  • హీరోగా నటిస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా  
  • లక్నోలో జరుగుతున్న షూటింగు
  • కథ బాగా నచ్చిందన్న ముద్దుగుమ్మ    
Rashmika Mandanna joins first Hindi film shoot

టాలీవుడ్ లో అగ్రశ్రేణి కథానాయికగా రాణిస్తున్న హాట్ హీరోయిన్ రష్మిక అటు కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటిస్తోంది. మరోపక్క ఇటీవల బాలీవుడ్ ప్రవేశం కూడా చేసిన సంగతి విదితమే. హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తొలిగా 'మిషన్ మజ్ను' అనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఈ చిత్రానికి శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తుండగా, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు.

ఇక గత నెలలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటికీ, రష్మిక మాత్రం తాజాగా చిత్రం షూటింగులో జాయిన్ అయింది. ప్రస్తుతం లక్నోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. దీనిపై ఈ ముద్దుగుమ్మ భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'ఆత్రుత, ఆదుర్దా, ఆనందం, ఉత్సుకత నడుమ సెట్లోకి అడుగుపెట్టాను. మిషన్ మజ్ను కథ బాగా నచ్చింది. ఈ యూనిట్ తో నా జర్నీ బాగుంటుందని ఆశిస్తున్నాను' అంటూ  పేర్కొంది.