ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ల‌పై మోదీ ఫొటో ఉండ‌కూడ‌దు: ఈసీ ఆదేశాలు

06-03-2021 Sat 12:11
  • దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్
  • మోదీ ఫొటోపై టీఎంసీ అభ్యంత‌రం 
  • మిగతా రాష్ట్రాల్లో ఇచ్చుకోవచ్చు
  • ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో ఈసీ నిర్ణ‌యం
remove modi image from vaccine certificates

దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చే స‌ర్టిఫికెట్‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఫొటో క‌న‌ప‌డుతోంది. దీనిపై ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీతో పాటు ప‌లువురు నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇటీవ‌లే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీఎంసీ.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ల‌పై మోదీ ఫొటోను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరింది. దీనిపై ఎన్నిక‌ల సంఘం స్పందిస్తూ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో మోదీ ఫోటోను తొల‌గించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంద‌ని గుర్తు చేసింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఇవ్వ‌చ్చ‌ని తెలిపింది.  కాగా, ఇప్ప‌టికే పెట్రోల్ బంకుల్లో ఉన్న‌ మోదీ హోర్డింగ్‌ల‌ను తీసివేయాలని కూడా ఎన్నిక‌ల సంఘం ఆదేశించిన విష‌యం తెలిసిందే.