Odisha: అప్పగింతల్లో ఏడ్చి ఏడ్చి చనిపోయిన నవ వధువు

  • ఒడిశాలోని సోనాపూర్ జిల్లాలో విషాదం
  • గుండెపోటుతో కుప్పకూలిన అమ్మాయి
  • ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందన్న వైద్యులు
  • కొన్ని నెలల క్రితమే ఆమె తండ్రి మృతి
  • తీవ్రమైన విషాదంలో ఉందన్న గ్రామస్థులు
  • అన్నీ అయి పెళ్లి చేసిన మేనమామ
Bride dies due to excessive crying during Bidai

పెళ్లి చేసుకుని పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్తుంటే.. ఏ అమ్మాయికైనా బాధ, దు:ఖం సహజం. అమ్మానాన్నలను, తోబుట్టువులను వదిలి వెళ్తుంటే వారికి పట్టరాని దు:ఖం వస్తుంది. ఒడిశాలో ఓ అమ్మాయి అలాగే ఏడ్చి ఏడ్చి తన పుట్టినింటి వారికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది. మెట్టినింట్లో కొత్త కుటుంబంతో నిండు నూరేళ్లు ఉండాల్సిన ఆ నవ వధువు.. అప్పగింతల్లో ఏడ్చి ఏడ్చి గుండెపోటుతో చనిపోయింది. ఈ విషాద ఘటన సోనాపూర్ జిల్లా జులుందా అనే గ్రామంలో శుక్రవారం జరిగింది.

బాలానగర్ జిల్లా తెటెల్ గావ్ కు చెందిన బిశికేశన్ అనే యువకుడితో గుప్తేశ్వరి సాహూ అలియాస్ రోసీ సాహూకు శుక్రవారం వివాహం జరిగింది. పెళ్ల తంతు పూర్తయ్యాక బిడ్డను అత్తారింటికి పంపించడం కోసం అప్పగింతలకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికూతురు రోసీ అదేపనిగా ఏడ్చింది. నీరసించిపోయి కుప్పకూలిపోయింది. వెంటనే ఆ అమ్మాయిని స్పృహలోకి తెచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

దీంతో దుంగురిపాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, కొన్ని నెలల క్రితమే తండ్రి చనిపోవడంతో ఆమె తీవ్రమైన విషాదంలో ఉందని, ఆ అమ్మాయి మేనమామ, కొందరు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలే ఆమెకు ఈ పెళ్లి చేశారని జులుందా గ్రామస్థులు చెప్పారు.

More Telugu News