కేఏ పాల్ పిల్‌పై హైకోర్టులో విచారణ.. నాటకీయ పరిణామాల మధ్య వారం రోజులు వాయిదా!

06-03-2021 Sat 10:14
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిల్
  • జీపీఏ ద్వారా పిల్ దాఖలుపై ధర్మాసనం అభ్యంతరం
  • చట్టబద్ధత తేల్చేందుకు విచారణ వాయిదా
AP High Court to decide legality of KA Pauls PIL via gpa against vizag steel plant privatisation

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ వారం రోజులపాటు వాయిదా పడింది. నష్టాల సాకుతో స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం సరికాదంటూ పాల్ తన పిల్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న పాల్ జీపీఏ హోల్డర్ జ్యోతి బెగల్ ద్వారా ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

నిన్న ఇది విచారణకు రాగా జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం.. జీపీఏ ద్వారా పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా వేయడం కుదురుతుందా? అని న్యాయస్థానం ప్రశ్నించగా, వీలవుతుందని పాల్ తరపు న్యాయవాది బాలాజీ సమాధానం ఇచ్చారు. రూల్ నంబర్ 4 ద్వారా ఇలాంటి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.

అయినప్పటికీ సందేహ నివృత్తి కాకపోవడంతో జీపీఏ ద్వారా పిల్ దాఖలు చేసే అవకాశం ఉందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఈ కేసును వాయిదా వేసింది. చట్టబద్ధతను నిర్ధారించేందుకు వారం రోజుపాటు విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. జీపీఏ ద్వారా పిల్ దాఖలుకు అర్హత లేదని తేలితే కనుక పాల్ దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేసే అవకాశం ఉంది.