Farm Laws: 100 రోజులు పూర్తిచేసుకున్న రైతు ఉద్యమం.. నేడు ఢిల్లీ కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధనం

Farmers observe black day today
  • నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు
  • సాగు చట్టాలు రద్దు చేసే వరకు ఇంటికెళ్లబోమంటున్న రైతులు
  • ఉద్యమం ద్వారా రైతుల్లో ఐక్యత పెరిగిందన్న యోగేంద్ర యాదవ్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులు నేడు ఢిల్లీ శివారులోని కుంద్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వేను 5 గంటలపాటు దిగ్బంధించనున్నారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని విరమించబోమని, ఎన్నాళ్లయినా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమం ప్రారంభమై 100 రోజులు పూర్తయిన సందర్భంగా నేడు ‘బ్లాక్ డే’ను పాటిస్తున్నట్టు చెప్పారు.

లక్ష్యాన్ని సాధించడంతో ఇప్పటికిప్పుడు తాము విజయం సాధించకపోయినప్పటికీ రైతుల్లో ఐక్యత తీసుకురావడానికి ఈ ఉద్యమం దోహదపడిందని మరో నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు.  వ్యవసాయ కుటుంబాల్లోని యువకుల్లో ఈ ఉద్యమం గొప్ప మార్పు తీసుకువచ్చిందని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ నేత కవిత కురుగంటి పేర్కొన్నారు. ఉద్యమం కారణంగా పంజాబ్‌లో యువత దురలవాట్లకు దూరమవుతున్నారని, మద్యం తాగడం తగ్గిందని పేర్కొన్నారు. అలాగే, మహిళా రైతులకు గుర్తింపు పెరిగిందని కవిత వివరించారు.
Farm Laws
Farmers Protest
New Delhi
Black Day

More Telugu News