Vikarabad District: రూ. 13 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ సర్పంచ్’

ACB Caught Manneguda Sarpanch for taking Rs 13 lakh bribe
  • ఏసీబీకి పట్టుబడిన వికారాబాద్ జిల్లా మన్నెగూడ సర్పంచ్
  • గతేడాది కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు
  • రూ.  20 లక్షలు డిమాండ్ చేసి రూ. 13 లక్షలకు అంగీకారం
  • నేడు చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ ప్రధాన రహదారిపై తనకున్న 27 గుంటల భూమిలో దుకాణ సముదాయం నిర్మించాలని ముజాహిద్ అలం నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అవసరమైన అన్ని అనుమతులను హెచ్ఎండీఏ నుంచి తీసుకున్నాడు. నెల రోజుల క్రితం భవన నిర్మాణం కూడా ప్రారంభించాడు.

విషయం తెలిసిన మన్నెగూడ సర్పంచ్ వినోద్ గౌడ్ అక్కడ వాలిపోయాడు. తనకు రూ. 20 లక్షలు ఇస్తేనే పనులు జరగనిస్తానని, లేదంటే పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలబోవని ముజాహిద్‌ను హెచ్చరించాడు. అయితే, తాను అంత సొమ్ము ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరికి రూ. 13 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. సొమ్ము సర్దుబాటు చేశానని వచ్చి తీసుకోవాలని సర్పంచ్ వినోద్‌కు ముజాహిద్ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆ సొమ్ము పట్టుకుని బండ్లగూడలోని ఆరెమైసమ్మ వద్దకు తీసుకురావాలని సూచించాడు.

అతడు చెప్పినట్టే అక్కడకు డబ్బుతో వెళ్లిన ముజాహిద్ కారులో ఉన్న సర్పంచ్‌కు డబ్బులు అందించాడు. అక్కడే మాటువేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడిచేసి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినోద్ గౌడ్‌‌ను నేడు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఏసీబీకి పట్టుబడిన వినోద్ గతేడాది రిపబ్లిక్ డే నాడు కలెక్టర్ నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి గత చరిత్రను కూడా వెలికి తీసే పనిలో పడ్డారు.
Vikarabad District
Manneguda
Birbe
ACB

More Telugu News