Viziangaram: విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 40 పూరిళ్లు దగ్ధం!

  • బాధితులందరూ గిరిజనులే
  • రూ. 40 లక్షల ఆస్తి నష్టం
  • కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
Huge fire accident in vizianagaram dist

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం, దేవుపల్లి పంచాయతీ పరిధిలోని కొండవానిపాలెంలో నిన్న మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 40 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పంట ఉత్పత్తులు, విలువైన పత్రాలు, నగదు కాలి బూడిదయ్యాయి . పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తహసీల్దారు సీతారామరాజు తెలిపారు.

బాధితులందరూ గిరిజనులేనని, వారంతా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కరాసి కుమారి అనే మహిళ ఇంటి పక్కన ఉన్న తుప్పల నుంచి నిప్పు రవ్వలు ఎగసి పడ్డాయని, ప్రమాదానికి అదే కారణమని తెలుస్తోంది. తొలుత కుమారి ఇంటికి మంటలు అంటుకున్నాయి. అయితే, వాటిని ఎవరూ గుర్తించకపోవడంతో అగ్ని కీలలు ఇతర ఇళ్లకు వ్యాపించాయి.  మొత్తం 50 ఇళ్లకు గాను 40 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 40 లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News