ఒకటి కాదు, రెండు కాదు... రూ.24 కోట్లు!... దుబాయ్ లో లాటరీ కొట్టిన భారతీయుడు

05-03-2021 Fri 22:12
  • దుబాయ్ లాటరీలో విజేతగా శివమూర్తి కృష్ణప్ప
  • కృష్ణప్ప ఓ మెకానికల్ ఇంజనీర్
  • 15 ఏళ్లుగా యూఏఈలో నివాసం
  • గత మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న కృష్ణప్ప
  • ఈసారి రెండు లాటరీ టికెట్లు కొనగా ఒకదానికి ప్రైజ్
Indian wins huge amount in Dubai lottery

గల్ఫ్ దేశాల్లో నిర్వహించే లాటరీల్లో అనేకమంది భారతీయులు కోట్లు గెలుచుకోవడం తెలిసిందే. తాజాగా కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతానికి చెందిన శివమూర్తి కృష్ణప్ప అనే వ్యక్తి ఏకంగా రూ.24 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకున్నాడు. శివమూర్తి కృష్ణప్ప వృత్తిరీత్యా ఓ మెకానికల్ ఇంజినీరు. గత 15 ఏళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్నాడు. ఇటీవల కృష్ణప్ప కొనుగోలు చేసిన లాటరీ (నెంబరు 202511) టికెట్ కు ప్రథమ బహుమతి లభించింది. ఈ బహుమతి భారత కరెన్సీలో రూ.24 కోట్లకు పైగా ఉంటుందట.

గత మూడేళ్లుగా ప్రతి నెలా లాటరీలు కొంటుంటే ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని కృష్ణప్ప పట్టరాని సంతోషంతో చెప్పాడు. కాగా, ఈసారి ఒకేసారి రెండు టికెట్లు కొనేందుకు నిర్వాహకులు అనుమతించడంతో తన అదృష్టం పండిందని తెలిపాడు. ఈ డబ్బుతో సొంతూర్లో ఓ ఇల్లు కట్టి, మిగతా డబ్బు పిల్లల చదువులు, వారి భవిష్యత్ కోసం దాచుకుంటానని ఆ ఇంజినీర్ వెల్లడించాడు.