ఈ బ్లడ్ గ్రూపు వ్యక్తులకు కరోనా ముప్పు తక్కువట!

05-03-2021 Fri 19:52
  • ప్రపంచవ్యాప్తంగా కరోనాపై అనేక పరిశోధనలు
  • అమెరికా పరిశోధకుల ఆసక్తికర అధ్యయనం
  • ఓ పాజిటివ్ వ్యక్తులపై కరోనా ప్రభావం తక్కువని వెల్లడి
  • వారిలో అవయవాలు దెబ్బతినే శాతం కూడా తక్కువేనని వివరణ
Research says Corona virus less impact in O Positive blood group people

2019 చివర్లో చైనాలో ఉనికి చాటుకున్న కరోనా వైరస్ భూతం అక్కడ్నించి ఖండాంతరాలకు ప్రయాణించి ప్రపంచదేశాలన్నింటినీ అతలాకుతలం చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ రావడం అందరికీ ఊరట అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ పై గత ఒకటిన్నర సంవత్సర కాలంగా అనేక పరిశోధనలు చేపట్టారు. అమెరికా పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులపై కరోనా పెద్దగా ప్రభావం చూపించడంలేదని పరిశోధకులు గుర్తించారు.

మిగతా బ్లడ్ గ్రూప్ వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతూ, ప్రాణాంతకంగా మారుతున్న కొవిడ్ మహమ్మారి... ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తులపై సాధారణ ప్రభావం చూపుతోందట. మామూలు పరిస్థితుల్లో కరోనా సోకితే రోగుల్లో కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అయితే ఓ గ్రూప్ వ్యక్తులకు కరోనా వచ్చినా వారిలో అవయవాలకు ఎలాంటి ముప్పు కలిగించడం లేదని గుర్తించారు.

న్యూయార్క్ లోని ప్రెస్బిటేరియన్ హాస్పిటల్ లో దాదాపు 14 వేల మంది రోగులను పరిశీలించి ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ఇతర బ్లడ్ గ్రూప్ వ్యక్తులతో పోల్చితే ఓ పాజిటివ్ వ్యక్తుల్లో అవయవాల పనితీరు సాఫీగానే ఉన్నట్టు తెలుసుకున్నారు.

రక్తం గడ్డకట్టే అంశంలో ఒక్కో గ్రూపు ఒక్కోవిధమైన లక్షణాలు కలిగివుంటుంది. ఓ పాజిటివ్ గ్రూపు రక్తం తక్కువగా గడ్డకట్టే లక్షణం కలిగివుంటుందని ఇన్సెర్మ్ అనే ఫ్రెంచ్ పరిశోధక సంస్థ రీసెర్చ్ డైరెక్టర్ జాక్వెస్ లీ పెండు వివరించారు. ఓ పాజిటివ్ వ్యక్తులపై కరోనా తాకిడి పెద్దగా కనిపించకపోవడానికి ఈ లక్షణమే కారణమని విశ్లేషించారు. కరోనా సోకిన తర్వాత రక్తం గడ్డకట్టడం వల్లే తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నట్టు వైద్యనిపుణులు మొదటి నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే.