BMW: భారత మార్కెట్లోకి కొత్త సెడాన్ ను తీసుకువస్తున్న బీఎండబ్ల్యూ

  • ఎం340ఐ మోడల్ ను తీసుకువస్తున్న బీఎండబ్ల్యూ
  • ప్రీ బుకింగ్స్ ప్రారంభం
  • రూ.1 లక్ష అడ్వాన్స్ తో బుకింగ్
  • ఎక్స్ షోరూం ధర రూ.65 లక్షల నుంచి ప్రారంభం
BMW to be launch latest model sedan in Indian market

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు, జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత విపణిలో కొత్త మోడల్ తీసుకువస్తోంది. అన్ని హంగులతో కూడిన ఎం340ఐ మోడల్ సెడాన్ ను భారత రోడ్లపై పరుగులు తీయించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆన్ లైన్ లో ముందస్తు బుకింగ్ లు ప్రారంభించింది. ప్రీబుకింగ్ అమౌంట్ రూపంలో రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కారు ప్రత్యేకతలు, ఫీచర్లు పరిశీలిస్తే... ఇందులో 2,998 సీసీ ఇంజిన్ పొందుపరిచారు. ఇది ఇన్ లైన్-6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్. 387 హార్స్ పవర్ వద్ద 5,800 ఆర్పీఎం శక్తిని విడుదల చేస్తుంది. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆల్ వీల్ డ్రైవ్ ఈ కారు ప్రత్యేకత. దాంతో 4.4 సెకన్లలోనే 100 కిమీ వేగం అందుకుంటుంది. ఎం340ఐ సెడాన్ టాప్ స్పీడ్ చూస్తే గంటకు 250 కిలోమీటర్లు.

దీంట్లో 4 డ్రైవ్ మోడ్లు (ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్) పొందుపరిచారు. ఐడ్రైవ్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, రొటేటరీ డయల్, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ చార్జింగ్, యాంబియెంట్ లైటింగ్ తదితర ఫీచర్లు దీంట్లో చూడొచ్చు. ఇక దీని ఎక్స్ షోరూం ధర విషయానికొస్తే రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటుంది.

More Telugu News