కేటీఆర్ అసమర్థత వల్లే తెలంగాణకు ఐటీఐఆర్ రాలేదు: బీజేపీ నేత వివేక్

05-03-2021 Fri 17:56
  • అమెరికాలో చదువుకున్న అజ్ఞాని కేటీఆర్
  • పార్లమెంటు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపాలయింది
  • అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ను కేటీఆర్ మించిపోయారు
KCR failed as TRS working president says Vinod

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అమెరికాలో చదువుకున్న అజ్ఞాని కేటీఆర్ అని దుయ్యబట్టారు.

ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ లపై కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని... అబద్ధాలు చెప్పడంలో తన తండ్రి కేసీఆర్ ను కేటీఆర్ మించిపోయారని ఎద్దేవా చేశారు. అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో హైదరాబాద్ 4వ స్థానం నుంచి 24వ స్థానానికి పడిపోయిందని... దీనికి కేటీఆర్ అసమర్థతే కారణమని అన్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఘోరంగా విఫలమయ్యారని వివేక్ విమర్శించారు. కేటీఆర్ అసమర్థత వల్లే పార్లమెంటు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపాలయిందని అన్నారు. ఆయన అసమర్థత వల్లే తెలంగాణకు ఐటీఐఆర్ రాలేదని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో సైతం టీఆర్ఎస్ ఓటమిపాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ముద్ర లోన్లపై అసత్యాలు చెపుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ ఫొటో పెట్టాల్సి వస్తుందనే భావనతో కేంద్ర పథకాలను కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు.