Subramanian Swamy: 89 ఏళ్ల శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అద్వానీ, జోషి 2024 ఎన్నికల్లో పోటీచేయాలి: సుబ్రహ్మణ్యస్వామి

  • కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్
  • బీజేపీ అధినాయకత్వం నిర్ణయం
  • మరోసారి తనదైన శైలిలో స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి
  • వృద్ధులను వనవాసానికి పంపే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని వెల్లడి
Subramanian Swamy comments on Metroman Sridharan CM candidature in Kerala

సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తనదైన శైలిలో స్పందించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా వయోవృద్ధుడైన మెట్రోమ్యాన్ శ్రీధరన్ ను ప్రకటించడంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ 89 ఏళ్ల శ్రీధరన్ ను కేరళ సీఎం రేసులో నిలిపిందని అన్నారు.

అయితే, 75 ఏళ్లకు పైబడిన వృద్ధ నేతలను మార్గదర్శన మండలి పేరుతో వనవాసానికి పంపే బీజేపీ ఇప్పుడు మెట్రోమ్యాన్ ను సీఎం అభ్యర్థిగా తీసుకువస్తోందని తెలిపారు. అందుకే, అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్ వంటి కురువృద్ధులు 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి సూచించారు.

బీజేపీ అధినాయకత్వం 75 ఏళ్లకు పైబడిన వృద్ధులను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పిస్తున్న నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం అద్వానీ వయసు 93 ఏళ్లు కాగా, జోషి వయసు 87 సంవత్సరాలు. వారిద్దరి అనుభవం దృష్ట్యా పార్టీకి సలహాలు ఇచ్చే మార్గదర్శన మండలిగా వారిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

More Telugu News