Revanth Reddy: మోదీతో కేసీఆర్ ఎందుకు దోస్తీ చేస్తున్నారో చెప్పాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on KCR and KTR
  • ఐటీఐఆర్ ప్రాజెక్టు రాలేదని కేటీఆర్ చెపుతున్నారు
  • ఇద్దరం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేద్దాం
  • మోదీ, కేసీఆర్ ఇద్దరూ నాణేనికి బొమ్మాబొరుసు వంటివారు
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్టు రాలేదని మంత్రి కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ కూర్చొని డైలాగులు చెపితే సరిపోదని... ఈ ప్రాజెక్టు కోసం ఢిల్లీలోని  జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేద్దామని... దమ్ముంటే కేటీఆర్ తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు.

ప్రధాని మోదీ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు చలిజ్వరం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీతో కేసీఆర్ ఎందుకు దోస్తీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ నాణేనికి బొమ్మాబొరుసు వంటివారని విమర్శించారు.

లక్షా 91 వేల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. కూకట్ పల్లిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు. 
Revanth Reddy
cong
KCR
KTR
TRS
Narendra Modi
BJP

More Telugu News