ప్రాణ వాయువు అయిపోతుందట.. భవిష్యత్​ లో దాని అవసరం లేకపోవచ్చట!

05-03-2021 Fri 14:35
  • వంద కోట్ల ఏళ్లలో ఆక్సిజన్ ఉండదన్న జపాన్ అధ్యయనం
  • సూర్యుడు వేడెక్కి కార్బన్ డయాక్సైడ్ విచ్ఛిన్నం
  • కార్బన్ డయాక్సైడ్ అందక మొక్కలకు నష్టం
  • కిరణ జన్య సంయోగ క్రియకు ఆటంకాలు
  • ఆక్సిజన్ విడుదల కాక పర్యావరణంలో తగ్గుదల
A billion years from now Earth may run out of oxygen says study

ఆక్సిజన్.. చెట్లు తప్ప సమస్త జీవరాశికి ప్రాణ వాయువది. అలాంటి ఆక్సిజన్ భూమి మీద అయిపోతే..? భవిష్యత్ లో దొరకకపోతే..? అసలు ఆక్సిజనే లేకుండా మనిషి బతికే రోజులొస్తే..? వస్తే కాదు.. వస్తాయని అంటోంది యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, జార్జియా టెక్ యూనివర్సిటీ కలిసి చేసిన అధ్యయనం. అయితే, దానికి ఓ వంద కోట్ల ఏళ్ల టైం పడుతుందని పేర్కొంది.

ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం చాలా చాలా ఎక్కువగా ఉంటుందని, రాబోయే 10 వేల ఏళ్లలో భూమిపై ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ లో పది లక్షలవ వంతు కోల్పోతుందని వెల్లడించింది. సౌర వ్యవస్థ జీవిత చక్రం కొనసాగుతున్నంతకాలం సూర్యుడు మరింత వేడెక్కుతాడని, ఫలితంగా పర్యావరణంలోని కార్బన్ డయాక్సైడ్ విచ్ఛిన్నమై ఆ వాయువు స్థాయులు తగ్గిపోతాయని తెలిపింది. దీంతో మొక్కలకు జీవనాధారమైన కార్బన్ డయాక్సైడ్ అందదని, కిరణ జన్య సంయోగ క్రియ జరగక ఆక్సిజన్ కూడా విడుదల కాదని పేర్కొంది.

దీంతో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయి మిథేన్ స్థాయులు 10 వేల రెట్లు పెరుగుతాయని పేర్కొంది. అయితే, రాబోయే రోజుల్లో మనిషికి ఆక్సిజన్ అన్నది అంత ఆవశ్యకమైన విషయం కాకపోవచ్చని అధ్యయనంలో పాల్గొన్న కజూమీ ఒజాకీ, క్రిస్ రైన్హార్డ్ లు చెప్పారు. ప్రస్తుతం ఆక్సిజన్ చాలా ఆవశ్యకమే అయినా.. అది శాశ్వతం మాత్రం కాదన్నారు. జీవానికి అనుకూలంగా ఉన్న గ్రహాలను ఎలా విశదీకరిస్తామన్నది దీనిపైనే ఆధారపడుతుందన్నారు. ఆక్సిజన్ లేకుండానే చాలా గ్రహాల మీద ఏక కణ జీవులు బతుకుతున్నాయని వారు గుర్తు చేశారు.