KTR: ఓపక్క దిగుమతి సుంకాలు పెంచి.. మరోపక్క మేకిన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా?: కేటీఆర్

KTR attends CII annual meeting in Hyderabad
  • హైదరాబాదులో సీఐఐ వార్షికోత్సవం 
  • విభజన హామీలు అమలు చేయడంలేదని కేటీఆర్ విమర్శలు  
  • తాము ఇంకెవర్ని అడగాలని కేటీఆర్ ఆవేదన
  • తెలంగాణ ఈ దేశంలో లేదా? అంటూ ఆగ్రహం
హైదరాబాదు ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన సీఐఐ వార్షిక సమావేశంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను కేంద్రం అమలు చేయడంలేదని ఆరోపించారు. రాష్ట్రం నుంచి పెద్దమొత్తంలో ఆదాయం పొందుతున్న కేంద్రం ఆ మేరకు కేటాయింపులు చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్రం హామీలు ఇచ్చి మాట నిలుపుకోని పక్షంలో తాము ఇంకెవర్ని అడగాలని ఆక్రోశం వెళ్లగక్కారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రమే మోకాలడ్డుతోందని, ఓవైపు దిగుమతి సుంకాలు పెంచుతూ మరోవైపు మేకిన్ ఇండియా అంటే కంపెనీలు బారులు తీరి వస్తాయా? అని ప్రశ్నించారు. కేంద్రం చేస్తున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలు వినడానికి బాగున్నా, అమలు తీరే సరిగా లేదని కేటీఆర్ విమర్శించారు. మేకిన్ ఇండియా అంటూ ఫార్మా రంగానికి సంబంధించి అత్యధికంగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నారని, కానీ హైదరాబాదులో భారీస్థాయిలో ఫార్మా పార్కు స్థాపనకు తమ ప్రభుత్వం ముందుకు వస్తే ఎందుకు సహకరించడంలేదని ప్రశ్నించారు.

ఇప్పటివరకు ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్) ఊసేలేదని, ప్రాజెక్టు రిపోర్టులు పంపినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఈ దేశంలోని రాష్ట్రం కాదా? అని నిలదీశారు.
KTR
CII
Annual Meet
Hyderabad
Telangana

More Telugu News