ప్రియుడితో వెళ్లిపోయిన కూతుర్ని హత్య చేసిన తండ్రి!

05-03-2021 Fri 14:22
  • ఫిబ్రవరి 16 పింకీకి ఇష్టం లేని పెళ్లి చేసిన తల్లిదండ్రులు
  • మూడు రోజుల తర్వాత పుట్టింటికి వచ్చి ప్రియుడితో వెళ్లిపోయిన వైనం
  • ఆ తర్వాత ఇంటి వద్దే కుమార్తెను హత్య చేసిన తండ్రి
Rajasthan Man Kills Married Daughter For Eloping With Lover

పెళ్లయిన తన కూతురు ప్రియుడితో వెళ్లిపోవడంతో ఓ తండ్రిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, 19 ఏళ్ల పింకీ అనే అమ్మాయికి ఇటీవలే పెళ్లి జరిగింది. అయితే, పెళ్లైన కొన్ని రోజులకు భర్తను వదిలేసి, తన ప్రియుడితో కలసి ఆమె వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి శంకర్ లాల్ సైనీ (50) తట్టుకోలేకపోయాడు. ఆమెను చంపేసి, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తాను హత్య చేసినట్టు పోలీసులకు తెలిపాడు.

శంకర్ లాల్ పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ హత్య గురించి పోలీసు అధికారి దీపక్ కుమార్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 16న పింకీకి ఇష్టం లేకున్నా పెళ్లి చేశారని తెలిపారు. పెళ్లైన మూడు రోజుల తర్వాత ఆమె తన పుట్టింటికి తిరిగి వచ్చిందని, ఆ తర్వాత ప్రియుడు రోషన్ తో కలిసి ఫిబ్రవరి 21న వెళ్లిపోయిందని చెప్పారు.

ఇది జరిగిన తర్వాత ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని... తన కుమార్తెను అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. ఆ తర్వాత పింకీ ఎక్కడుందో ఆమె కుటుంబసభ్యులు కనుక్కున్నారని... ఆమెను ఇంటికి తీసుకొచ్చారని, ఇంటి వద్దే ఆమెను ఆమె తండ్రి కడతేర్చాడని చెప్పారు.