Swati Mohan: ‘స్టార్​ ట్రెక్​’తోనే నా నాసా ప్రయాణం మొదలైంది: బైడెన్​ తో స్వాతి మోహన్​

  • షోలోని అంతరిక్ష సన్నివేశాలు కట్టిపడేశాయని కామెంట్
  • పర్సెవరెన్స్ ల్యాండింగ్ తన తొలి ప్రయోగమని వెల్లడి
  • ఏడాది ఉన్నప్పుడే అమెరికాకు వచ్చానన్న స్వాతి
Road to Nasa started with watching Star Trek as a child scientist Swati Mohan tells Biden

స్వాతి మోహన్.. నాసా పర్సెవరెన్స్ ను అరుణ గ్రహంపైన దింపే ముందు వరకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ, ఆ తర్వాత ఆమె పేరు మార్మోగిపోయింది. రోవర్ ల్యాండింగ్ లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఆమె. అయితే, తన నాసా ప్రయాణం మొదలైంది ‘స్టార్ ట్రెక్’ అనే హాలీవుడ్ టీవీ షోతోనేనని ఆమె చెప్పారు.

  శుక్రవారం నాసాతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో స్వాతి మోహన్ కూడా పాల్గొన్నారు. తాను ఏడాది వయసున్నప్పుడే అమెరికాకు వచ్చానని అన్నారు. చిన్నప్పుడు 'స్టార్ ట్రెక్' షో మొదటి భాగం చూసినప్పుడే అంతరిక్ష రంగం వైపు రావాలని అనుకున్నానని చెప్పారు.

  ఈ విశేషాలన్నింటినీ ఆమె బైడెన్ తో పంచుకున్నారు. ఆ షోలోని అంతరిక్ష సన్నివేశాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, దీంతో కొత్త జీవితాన్ని అందులోనే వెతుక్కోవాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఇప్పుడు నాసాలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  

జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో పర్సెవరెన్స్ తన మొట్టమొదటి ప్రయోగమని స్వాతి చెప్పారు. ఇంత గొప్ప టీంతో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పర్సెవరెన్స్ ల్యాండింగ్ కు ముందు రోజులన్నీ సాఫీగానే గడిచినా.. ఆ రోజు మాత్రం చాలా భయం భయంగా గడిచిందన్నారు. ప్రత్యేకించి ల్యాండింగ్ చేస్తున్న చివరి 7 నిమిషాలు భయంకరంగా గడిచాయని చెప్పారు.

కాగా, నాసా 'మార్స్ 2021' ప్రయోగంలో స్వాతి మోహన్ గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్లకు నేతృత్వం వహించారు. ఫిబ్రవరి 18న పర్సెవరెన్స్ ను విజయవంతంగా ల్యాండ్ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

More Telugu News