కరోనా వైరస్​ లో వేగంగా జన్యు మార్పులు

05-03-2021 Fri 12:13
  • వైరస్ జన్యురాశిని అనుక్రమణం చేసిన ఐఐఎస్సీ
  • బంగ్లాదేశ్ వైరస్ తో దగ్గరిపోలికలున్నాయని వెల్లడి
  • వివిధ దేశాలకు చెందిన వైరస్ ఆనవాళ్ల గుర్తింపు
Covid mutates faster than before warns IISC

ప్రపంచాన్ని ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకం కరోనా వైరస్ లు బెంబేలెత్తిస్తున్నాయి. చాలా దేశాలకు అవి ఇప్పటికే విస్తరించాయి. మన దేశంలోనూ కరోనా వైరస్ లో జన్యు మార్పులు జరుగుతున్నాయని, మునుపటి కన్నా వేగంగా ఆ మార్పులు జరుగుతున్నాయని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

బెంగళూరులోని కొందరు వ్యక్తుల నుంచి శాంపిళ్లను సేకరించిన శాస్త్రవేత్తలు.. వాటి నుంచి వైరస్ లను వేరు చేశారు. ఆ శాంపిళ్ల నుంచి వేరు చేసిన వైరస్ లలో దాదాపు 27 జన్యు మార్పులు జరిగాయని గుర్తించారు. ఒక్కో శాంపిల్ లో సగటున 11 మార్పులు జరిగినట్టు తేల్చారు. ఇది జాతీయ సగటు (8.4), అంతర్జాతీయ సగటు (7.3) కన్నా చాలా ఎక్కువని చెప్పారు.

జీనోమ్ (జన్యు రాశి) మొత్తాన్ని ఒకేసారి అనుక్రమణం (సీక్వెన్స్) చేసేందుకు వీలుగా తర్వాతి తరం అనుక్రమణ (ఎన్జీఎస్) సాంకేతికతను వినియోగించినట్టు చెప్పారు. తర్వాత వైరస్ చరిత్ర, దాని వ్యాప్తిని తెలుసుకునేందుకు ప్రపంచంలోని జన్యు మార్పులు జరిగిన వైరస్ లతో ఓ క్రమాన్ని తయారు చేశామని, తర్వాత వాటిని పోల్చి చూశామని వెల్లడించారు.

భారత్ లో ప్రస్తుతం వ్యాప్తి చెందిన వైరస్ కు బంగ్లాదేశ్ లో వ్యాప్తిలో ఉన్న వైరస్ తో దగ్గరి పోలికలున్నాయని అన్నారు. అయితే, ఈ ఒక్క దేశానికి చెందిన వైరస్ అనే కాకుండా.. వివిధ దేశాల మూలాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.