పాకిస్థాన్ సూపర్‌ లీగ్ వాయిదా ప‌డ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ ఘాటు వ్యాఖ్య‌లు!

05-03-2021 Fri 11:23
  • సరైన పర్యవేక్షణ లేదు
  • బాధ్యులైనవారిపై  చర్యలు తీసుకోవాలి
  • ఇమ్రాన్ ఖాన్ స్పందించాలి
  • క‌‌రోనా నిబంధనల్ని ప‌ట్టించుకోలేదు
akhtar slams pcb

పాకిస్థాన్‌‌ సూపర్‌ లీగ్ ‌(పీఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌ను నిన్న వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పీఎస్ఎల్‌ జరుగుతున్న సమయంలో కొంద‌రు క్రికెట‌ర్లు బయోసెక్యూర్‌ నిబంధనల్ని ఉల్లంఘించడం, కొంద‌రు కరోనా బారిన పడ‌డం, దీంతో పీఎస్ఎల్ ను కొనసాగించడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం వంటి కార‌ణాల‌తో పాక్ ‌క్రికెట్‌ బోర్డుపై ఈ నిర్ణ‌యం తీసుకుంది.

అయితే, ఈ నిర్ణ‌యంపై పాక్ జట్టు మాజీ క్రికెట‌ర్‌ షోయబ్‌ అక్తర్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశాడు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వ‌ల్లే క్రికెట‌ర్లకు కరోనా సోకింద‌ని ఆయ‌న చెప్పాడు. దీనికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

అలాగే, బయోసెక్యూర్‌ పరిస్థితుల్ని స‌మ‌ర్థంగా అమలు చేయలేద‌ని చెప్పాడు. క‌రోనా ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి క్రికెట‌ర్ల‌ను ప్ర‌మాదంలో ప‌డేసిన‌ మెడికల్‌ సిబ్బందిని శిక్షించాలని ఆయ‌న వ్యాఖ్యానించాడు.

వారు ఆటగాళ్ల జీవితాలతో ఆడుకున్నారంటూ మండిప‌డ్డాడు. అస‌లు పీసీబీ సీఈవో వసీమ్‌ఖాన్ ను పీసీబీ ఛైర్మన్‌ ఎహ్‌సాన్ తీసుకొచ్చార‌ని, దీనికి ఆయన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంలో త‌మ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ జోక్యం చేసుకోవాలని అన్నాడు.

ఆటగాళ్ల కోసం బుక్‌ చేసిన హోటళ్ల‌లో ప‌లు పంక్ష‌న్లు జరుగుతున్నాయని మండిప‌డ్డాడు. క్రికెట‌ర్లు కూడా క‌రోనా నిబంధనల్ని ప‌ట్టించుకోకుండా తిరుగుతున్నారని ఆయ‌న చెప్పాడు. ఈ ప‌రిణామాల‌తో
పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పరువు పోయిందని అన్నాడు. పీఎస్‌ఎల్‌ను నిర్వహించి పీసీబీ ఛైర్మన్‌ ఎహ్‌సాన్ తమ‌ దేశ పరువు తీశాడ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.