కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌ను బెదిరించిన నిందితుడి అరెస్ట్

05-03-2021 Fri 08:40
  • ఎమ్మెల్యే కుమారుడితో నిందితుడికి గొడవ
  • మొబైల్ చోరీ చేసి ఎమ్మెల్యేకు ఫోన్
  • రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్
Culprit Who Warns Karwan MIM MLA Kausar Mohiuddin Arrested

హైదరాబాదులోని కార్వాన్‌ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హకీంపేటకు చెందిన బిలాల్ (21) పెయింటర్. గతంలో మొహియుద్దీన్ కుమారుడితో బిలాల్‌కు గొడవ జరిగింది.

దీనిని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న బిలాల్ గతంలో తాను పనిచేసిన హోటల్‌కు వెళ్లి ఓ సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. ఆ ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కౌసర్‌కు ఫోన్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో ఎమ్మెల్యే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎమ్మెల్యేను బెదిరించింది బిలాల్ అని గుర్తించారు. నిన్న అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.