విభేదాలతో ఆగిన పెళ్లి.. అమెరికాలో చిత్తూరు యువతి ఆత్మహత్య

05-03-2021 Fri 07:42
  • వధూవరులిద్దరూ అమెరికాలోనే
  • పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పిన వరుడు
  • వరుడి కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు
Chittor girl died by suicide in America after marriage broken

లగ్నపత్రికలు కూడా ముద్రించిన తర్వాత పెళ్లి వద్దని వరుడు మొండికేయడంతో మనస్తాపానికి గురైన చిత్తూరు యువతి అమెరికాలోని టెక్సాస్‌లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు పోలీసు కాలనీకి చెందిన సుష్మ (25) అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది. జిల్లాలోని పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన భరత్ టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చియించిన పెద్దలు లగ్న పత్రికలు కూడా రాయించారు. అయితే, పది రోజుల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నెల 3న వివాహం జరగాల్సి ఉండగా, తాను ఈ పెళ్లి చేసుకోలేనని, తనకు కొంత సమయం కావాలని భరత్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సుష్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కొన్ని రోజులు ఆగితే అన్నీ సర్దుకుంటాయని ఇరు కుటుంబాల వారు ఇద్దరికీ నచ్చజెప్పారు.

అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణమైన భరత్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుష్మ కుటుంబ సభ్యులు చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.