పైలట్‌పై దాడిచేసిన పిల్లి.. విమానం అత్యవసర ల్యాండింగ్

05-03-2021 Fri 06:55
  • ఖర్టూమ్ నుంచి ఖతర్ వెళ్తున్న విమానం
  • టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్‌లో పిల్లి ప్రత్యక్షం
  • ఎలా చేరిందన్న దానిపై సస్పెన్స్
feline attacks pilot forcing plane to divert back

ఎలా వెళ్లిందో ఏమో కానీ, విమానం కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లిన ఓ పిల్లి పైలట్‌పై దాడికి దిగింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సూడాన్‌లో జరిగిందీ ఘటన.

టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం ఒకటి రాజధాని ఖర్టూమ్ నుంచి ఖతర్‌లోని దోహాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైన పిల్లి భయంతో పైలట్‌పై దాడిచేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పైలట్ గ్రౌండ్ కంట్రోల్‌కు సమాచారం అందించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.

విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని చెబుతున్నారు. విమానం కాక్‌పిట్‌లోకి పిల్లి ఎలా వచ్చిందన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ, విమానాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో అది కాక్‌పిట్‌లోకి వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు.