న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ

04-03-2021 Thu 21:57
  • నార్త్ ఐలాండ్ ను కుదిపేసిన భూకంపం
  • రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రత
  • వేకువజామున సునామీ మొదటి అల వస్తుందన్న అధికారులు
  • తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరిక
Huge earthquake hits north island of New Zealand

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపదేశం న్యూజిలాండ్ కు చెందిన నార్త్ ఐలాండ్ ను భారీ భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంప తీవ్రత రీత్యా న్యూజిలాండ్ తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా అధికారులు అప్రమత్తం చేశారు. భూకంప నష్టంపై ఇంకా వివరాలు తెలియలేదు. నార్త్ ఐలాండ్ తూర్పు ప్రాంతంలో సునామీ కబళించే ప్రమాదం ఉన్నట్టు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) భావిస్తోంది.

కాగా, భూకంప కేంద్రం గిస్బోర్న్ నగరానికి సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడికి సమీపంలోని కేప్ రనవే, టొలాగా బే ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం వేకువజామున 3.34 గంటలకు సునామీ మొదటి అల విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. సునామీ ప్రభావం కొన్ని గంటల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.