'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?

04-03-2021 Thu 21:27
  • ప్రభాస్ తో 'సాహో' సినిమా చేసిన సుజీత్  
  • ఇటీవల సుదీప్ కి కథ చెప్పిన వైనం 
  • నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిన సుదీప్
  • యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా నిర్మాణం   
Sujith to direct Sudeep

కన్నడ నటుడు సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి పాత్రనైనా తనదైన విభిన్నమైన శైలిలో నటించి మెప్పిస్తాడు. కన్నడలో ఎన్నో సినిమాలలో నటించి పేరుతెచ్చుకున్న సుదీప్ 'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా తన అభినయాన్ని రుచిచూపించి.. వారికి దగ్గరయ్యాడు. మంచి ఆఫర్లు వస్తే అప్పుడప్పుడు తెలుగు సినిమాలలో నటిస్తూనే వున్నాడు. ఇప్పుడీ వెర్శటైల్ యాక్టర్ మన తెలుగు దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.  

ఆమధ్య ప్రభాస్ హీరోగా 'సాహో' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సుజీత్ మంచి టెక్నీషియన్ గా పేరుతెచ్చుకున్నారు. 'సాహో' సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించకపోయినప్పటికీ, దర్శకుడిగా సుజీత్ టేకింగుకి మంచి పేరు వచ్చింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు.

ఈ క్రమంలో ఇటీవల సుదీప్ ని కలసి సుజీత్ ఓ కథ వినిపించాడని, అది ఆయనకు బాగా నచ్చిందనీ అంటున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగే ఈ చిత్రంలో నటించడానికి సుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ, బెంగళూరులో షూటింగ్ జరుగుతుందనీ సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.