ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి

04-03-2021 Thu 20:12
  • భారత్ లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
  • అందరికీ వ్యాక్సిన్ అందడంలేదన్న ఢిల్లీ హైకోర్టు
  • సీరం, భారత్ బయోటెక్ లకు ఆదేశాలు
  • అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టీకరణ
  • ఎంత మొత్తంలో వ్యాక్సిన్ తయారుచేస్తున్నారని ప్రశ్నించిన కోర్టు
Delhi High Court asks SII and Bharat Biotech disclose the vaccine manufacturing capacity

దేశంలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న తీరుపై ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం అత్యావశ్యకమైనప్పటికీ, పూరిస్థాయిలో వ్యాక్సినేషన్ జరగకపోవడాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది.

ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న వివేచన ఇప్పుడు అత్యవసరం అని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా, దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు తమ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వెల్లడించాలని ఆదేశించింది.

"కరోనా వ్యాక్సిన్లను మనం పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నదే లేదు. సుహృద్భావ చర్యల కింద విదేశాలకు అందించడమో, లేక అమ్ముకోవడమో చేస్తున్నాం. కానీ మన సొంత ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది" అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.

ఒక రోజుకు, ఒక వారానికి, ఒక నెలకు ఎంత మొత్తంలో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయగలరో విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు భారత్ బయోటెక్, సీరం సంస్థలకు నిర్దేశించింది. మార్చి 9 లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. వ్యాక్సినేషన్ పై దాఖలైన ఓ పిల్ ను విచారిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

అంతేకాదు, ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వదలచుకున్నారు? వారిని ఎలా వర్గీకరిస్తున్నారు? ఏ కారణాలతో వారిని విభజిస్తున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.