Bandi Sanjay: టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్

  • తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఈ నెల 14న పోలింగ్
  • తమ ప్రత్యర్థి టీఆర్ఎస్సేనంటూ బండి సంజయ్ సమరనాదం
  • మంత్రులు టీచర్లను బెదిరిస్తున్నారని ఆరోపణ
  • ఓటేయకపోతే చూస్కుంటాం అని హెచ్చరిస్తున్నారని వెల్లడి
Telangana BJP Chief Bandi Sanjay warns TRS leaders

టీఆర్ఎస్ ను మరోసారి దెబ్బతీయాలని కృతనిశ్చయంతో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన విమర్శల్లో మరింత పదును పెంచారు. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఊహించని ఫలితాలు రాగా, బీజేపీ బాగా పుంజుకుంది. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా కాషాయదళం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్సే తమ ప్రధాన ప్రత్యర్థి అని చెబుతున్న బండి సంజయ్ తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఇంకా మూడేళ్లు తామే అధికారంలో ఉంటామని చెప్పుకుంటూ కొందరు మంత్రులు టీచర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఓటేయకపోతే చూస్కుంటాం అని హెచ్చరిస్తున్నారని వివరించారు. కానీ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఒక విషయం గుర్తుంచుకోవాలని, టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు మార్చి 14న గన్నులుగా మారి కేసీఆర్ గుండెల్లో దిగబోతున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యేనని బండి సంజయ్ ఉద్ఘాటించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాదు... పైసలు నింపుకున్న గల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బ్రోకర్ అంటూ నిప్పులు చెరిగారు.

తెలంగాణలో ఈ నెల 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానంతో పాటు వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున పీవీ కుమార్తె వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీలో ఉండగా, బీజేపీ తరఫున రాంచందర్ రావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News