విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత... ఖరారు చేసిన టీడీపీ అధినాయకత్వం

04-03-2021 Thu 18:26
  • 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా బరిలో ఉన్న శ్వేత
  • శ్వేత ఎంపీ కేశినేని నాని కుమార్తె
  • ఇటీవల బెజవాడ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్న వైనం
  • మేయర్ అభ్యర్థిత్వం కోసం రేసులో పలువురు
  • శ్వేత పేరు ఖరారు చేసిన టీడీపీ హైకమాండ్
TDP confirms Kesineni Swetha as Vijayawada mayor candidate

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ఖరారు చేశారు. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. మేయర్ పదవికి అనేక మంది ఆశావహులు ఉన్నప్పటికీ ఇటీవల విజయవాడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న కేశినేని శ్వేత వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. కేశినేని శ్వేత ఎంపీ కేశినేని నాని కుమార్తె అన్న విషయం తెలిసిందే. మేయర్ పదవి రేసులో శ్వేతకు నందిరెడ్డి గాయత్రి నుంచి చివరివరకు పోటీ ఎదురైంది. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ... నాని కుమార్తె శ్వేత పేరును తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది.

బెజవాడ మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత 11వ డివిజన్ లో కార్పొరేటర్ గా బరిలో ఉన్నారు. అయితే ఇటీవల విజయవాడ టీడీపీలో లుకలుకలు బయటపడ్డ నేపథ్యంలో కేశినేని శ్వేత అన్ని వర్గాలను కలుపుకుని ఎలా ముందుకు వెళతారన్నది ఆసక్తి కలిగిస్తోంది.