కళ్లు చెదిరే లెవెల్లో పూజ హెగ్డే పారితోషికం!

04-03-2021 Thu 17:48
  • టాలీవుడ్ లో అగ్రకథానాయికగా పూజ హెగ్డే 
  • నెల్సన్ దర్శకత్వంలో విజయ్ 65వ సినిమా
  • మూడున్నర కోట్లు తీసుకుంటున్న పూజ
Pooja Hegde charges a bomb for Vijays film

ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న పూజ హెగ్డే.. అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా వుంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో రెమ్యునరేషన్ పరంగా ఈ ముద్దుగుమ్మ భారీగానే డిమాండు చేస్తోంది. తాజాగా తమిళంలో ఓ సినిమాకి ఆమె తీసుకుంటున్న పారితోషికం ఫిగర్ తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.

తన కెరీర్ తొలినాళ్లలో ఈ చిన్నది 'ముగమూడి' అనే తమిళ సినిమాలో కథానాయికగా నటించింది. మళ్లీ ఇప్పుడు స్టార్ హీరో విజయ్ సరసన కథానాయికగా నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. విజయ్ తన 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారట. ఇక ఇందులో నటించడానికి ఈ చిన్నది 3.5 కోట్లు డిమాండ్ చేసినట్టు, చేసేదేమీలేక ఆమె అడిగినంతా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.