నాలుగో టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

04-03-2021 Thu 16:04
  • అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • మరోసారి విజృంభించిన అక్షర్, అశ్విన్, సుందర్ త్రయం
  • 55 పరుగులతో రాణించిన బెన్ స్టోక్స్
  • సిరాజ్ కు 2 వికెట్లు
England all out in first innings of fourth test

అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కథ ముగిసింది. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లపై తన తడబాటును మరోసారి బహిర్గతం చేసుకున్న ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో టెస్టుతో పోల్చితే కాస్త మెరుగ్గా ఆడిన ఇంగ్లండ్ టాస్ గెలిచిన ఆధిక్యతను మాత్రం నిలుపుకోలేకపోయింది. తొలిరోజు చివరి సెషన్ ముగియకముందే వికెట్లన్నీ కోల్పోయింది.

టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4/68), అశ్విన్ (3/47), సుందర్ (1/14) మరోసారి బంతిని గింగిరాలు తిప్పగా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (2/45) కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ (5), జానీ బెయిర్ స్టో (28)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు.

55 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. డాన్ లారెన్స్ 46 పరుగులు, ఓల్లీ పోప్ 29 పరుగులతో రాణించారు. అయితే వీరు టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ చేరారు.