రౌడీయిజం చేయాలనుకుంటే పాత బెజవాడను చూస్తారు: వైసీపీ నేతలకు బోండా ఉమ వార్నింగ్

04-03-2021 Thu 14:39
  • ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
  • విజయవాడలో రణరంగం
  • తమ మహిళా అభ్యర్థిని దూషించారన్న ఉమ
  • దీటుగా బదులిస్తామని హెచ్చరిక 
Bonda Uma warns YCP leaders

విజయవాడ మున్సిపల్ ఎన్నికల వాతావరణం భగ్గుమంటోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ మీడియా సమావేశంలో పోలీసులపైనా, వైసీపీ నేతలపైనా  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తరఫున బరిలో ఉన్న ఓ మహిళా అభ్యర్థిని పోలీసు అధికారి ఫోన్ లో బెదిరిస్తున్నాడని బోండా ఉమ ఆరోపించారు.

మహిళా అభ్యర్థులకు రక్షణ కల్పించలేకపోగా, బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. "పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు రిటైర్ అయ్యేవరకు విధుల్లోనే ఉంటారు... నిన్నటి వరకు మేం అధికారంలో ఉన్నాం, ఇవాళ వైసీపీ వచ్చింది, రేపు మళ్లీ మేం అధికారంలోకి వస్తాం" అంటూ ఆవేశంగా స్పందించారు.

ఓ వైసీపీ నేత టీడీపీ మహిళా అభ్యర్థి వాహనానికి తన మోటార్ సైకిల్ ను అడ్డుపెట్టి అసభ్యంగా దూషించాడని ఉమ ఆరోపించారు. "ఏమనుకుంటున్నారు మీరు..? మేం ఎంతమందిమి ఉన్నాం? ప్రజలెంత మంది ఉన్నారు? గాలికి వచ్చిన మీరెంతమంది ఉన్నారు?... వైసీపీ నేతలకు ఇదే మా హెచ్చరిక... పాత బెజవాడను చూడాలనుకుంటున్నారా? అయితే అందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం. పాత బెజవాడ ఎలా ఉంటుందో చూపిస్తాం" అంటూ వ్యాఖ్యానించారు.