క్యాన్సర్ బాధిత బాలుడికి కాసేపు తన బాధ్యతలు అప్పగించిన గుంటూరు ఎస్పీ

04-03-2021 Thu 14:17
  • గుంటూరుకు చెందిన రిహాన్ కు క్యాన్సర్ 
  • పోలీసు కావాలన్నది రిహాన్ కల
  • ఓ ఎన్జీవో ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి
  • బాలుడ్ని తన కార్యాలయానికి పిలిపించుకున్న వైనం
Guntur SP Ammireddy handed over his charge to a cancer child

గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తన సహృదయతను చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి ముఖంలో సంతోషం నింపారు. గుంటూరుకు చెందిన నోయల్ చాంద్, బీబీ నూర్జహాన్ దంపతులకు రిహాన్ అనే కుమారుడు ఉన్నాడు. రిహాన్ క్యాన్సర్ బారినపడడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎలాగోలా అతడికి చికిత్స చేయిస్తున్నారు. అయితే, రిహాన్ కు పోలీసు అవ్వాలన్న కోరిక బలంగా ఉంది. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ గుంటూరు జిల్లా పోలీసులకు తెలిపింది. దాంతో క్యాన్సర్ బాధిత చిన్నారి రిహాన్ ను కలుసుకునేందుకు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి సంతోషంగా ఒప్పుకున్నారు.

వెంటనే ఆ చిన్నారిని తన కార్యాలయానికి పిలిపించుకుని, తన కుర్చీలో కూర్చోబెట్టడమే కాకుండా, ఎస్పీగా బాధ్యతలు కూడా అప్పగించారు. ఎస్పీ చాంబర్ లో కూర్చుని, ఆదేశాలు ఇస్తున్న ఈ చిన్నారి ముఖంలో ఆనందం నిజంగా వెలకట్టలేనిది. రిహాన్ తల్లిదండ్రులైతే ఎస్పీ కుర్చీలో తమ కుమారుడు కూర్చోవడాన్ని చూసి మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలను గుంటూరు జిల్లా పోలీసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిన్నారి కోరిక పట్ల సానుకూలంగా స్పందించిన ఎస్పీ అమ్మిరెడ్డిని అందరూ అభినందిస్తున్నారు.