Central Vista: సెంట్రల్​ విస్టాలో ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇళ్లకు భూగర్భ సొరంగాలు!

Tunnels to link PM and VP homes to new Parliament building
  • రూ.20 వేల కోట్ల వ్యయంతో సెంట్రల్ విస్టా
  • నాలుగంతస్తులుగా పార్లమెంట్ భవనం 
  • వేగంగా చేరుకోవడానికి సొరంగ మార్గాలు 
  • ప్రధాని ఇల్లు, కార్యాలయం సౌత్ బ్లాక్ వైపు 
  • 2022 నాటికి పూర్తి  చేయాలని లక్ష్యం
కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ సముదాయం సెంట్రల్ విస్టాలో భాగంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి ఇళ్లకు, ఎంపీల చాంబర్లకు మూడు భూగర్భ సొరంగాలను నిర్మించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. భద్రతా ప్రొటోకాల్స్ ను పాటిస్తూ వేగంగా పార్లమెంట్ కు చేరుకునేలా ఈ సొరంగాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.  

ప్రస్తుతం వీఐపీల రాకపోకల సందర్భంగా వారి కాన్వాయ్ తో ట్రాఫిక్ కు, జనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ భూగర్భ సొరంగాల ద్వారా ఆ బాధలకు స్వస్తి చెప్పొచ్చని అంటున్నారు. సెంట్రల్ విస్టా భవన నిర్మాణ ప్రణాళిక ప్రకారం ప్రధాని ఇల్లు, కార్యాలయం సౌత్ బ్లాక్ వైపు రానున్నాయి. ఉప రాష్ట్రపతి ఇల్లు ఉత్తర దిక్కున బ్లాక్ లో ఉండనుంది. ప్రస్తుతం రవాణా, శ్రమ శక్తి భవనాలు ఉన్న ప్రదేశాల్లో ఎంపీల చాంబర్లను నిర్మించనున్నారు.

కాగా, ఈ సొరంగాలను ఒకే వరుసగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వీఐపీలు తప్ప ఎవరూ రారు కాబట్టి సింగిల్ లేన్ సరిపోతుందని భావిస్తున్నట్టు సమాచారం. చిన్న దూరాలే కాబట్టి గోల్ఫ్ కార్ట్ (గోల్ఫ్ లో వాడే చిన్న చిన్న వాహనాలు) వాడొచ్చని తెలుస్తోంది. అయితే, రాష్ట్రపతి భవన్ నుంచి మాత్రం ఇలాంటి సొరంగాలు అవసరం లేదని అధికారులు అంటున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చాలా దూరం కావడం, పార్లమెంట్ కు ఆయన వచ్చేది తక్కువ కావడం, దానికీ షెడ్యూల్ ముందే ఖరారవడం వంటి కారణాల వల్ల సొరంగాలు అవసరం లేదని చెబుతున్నారు.

పార్లమెంట్ నిర్మించే ప్రాంతంలో జనానికి ఇబ్బందులు లేకుండా చూడడం కోసమే భూగర్భ సొరంగాలను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ల్యుటెన్స్ బంగళా నుంచి పార్లమెంట్ మధ్య ఎప్పుడూ ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జనానికి అసౌకర్యం కలగకుండా, పర్యాటకులకు దారులను తెరిచి ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

జనాల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని, ఉప రాష్ట్రపతి ఇళ్లు, ఎంపీల చాంబర్లను ఎక్కడో దూరంగా కాకుండా పార్లమెంట్ ఆవరణలోనే కడుతున్నారని అధికారులు చెబుతున్నారు. కాగా, 970 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల మేర నాలుగంతస్తులుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2022 నాటికి పూర్తి  చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల్లో కొంత భాగాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కు కేంద్రం అప్పగించింది. మొత్తంగా రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కట్టనున్నారు.
Central Vista
Prime Minister
Vice President
Parliament
Tunnel

More Telugu News