బ్రిటన్​ రాజ కుటుంబంపై మెఘన్​ సంచలన వ్యాఖ్యలు

04-03-2021 Thu 13:26
  • తమపై లేనిపోని అసత్యాలు నూరిపోస్తున్నారని వ్యాఖ్యలు
  • ఇప్పటికీ మేం నోరు మూసుకుని కూర్చుంటామంటే పొరపాటే
  • తాము కొత్తగా పోగొట్టుకునేదేమీ లేదని కామెంట్
  • సీబీఎస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాణి ఆరోపణలు
Meghan Markle Accuses Buckingham Palace Of Perpetuating Falsehoods

బ్రిటన్ రాజకుటుంబంపై యువరాజు హ్యారీ భార్య మెఘన్ మార్కెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై నోరు విప్పేందుకు తాము వెనుకాడబోమన్నారు. రాజసౌధం (బకింగ్ హాం ప్యాలెస్) తమపై లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తోందని అన్నారు. ప్రముఖ చానెల్ సీబీఎస్ టీవీలో ఓప్రా విన్ ఫ్రే నిర్వహించిన అమెరికన్ టాక్ షోలో ఆమె పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించి సీబీఎస్ హైలైట్స్ ను విడుదల చేసింది.

అందులో భాగంగా.. మీరు చెప్పే నిజాన్ని రాజసౌధం వింటుందంటారా? అని విన్ ఫ్రే ప్రశ్న సంధించారు. ‘‘మాపై లేనిపోని అసత్యాలన్నింటినీ రాజసౌధమే నూరిపోస్తుంటే.. ఇంకా నోరు మూసుకుని కూర్చుంటామని వారు ఎలా అనుకుంటారు?’’ అని మెఘన్ సమాధానమిచ్చారు. దాని వల్ల తాము పోగొట్టుకునేదేమీ లేదని, ఇప్పటికే చాలా కోల్పోయామని అన్నారు.  కాగా, ఆదివారం సాయంత్రం ఈ టాక్ షో ప్రసారం కాబోతోంది.